౨౧ సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. ౨౨ మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును. ౨౩ వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణ ములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. ౨౪ శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. ౨౫ శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చ యముగా ఆ పేరు పెట్టుదురు గదా.
దేవునికి మాత్రమే భయపడండి
౨౬ కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ౨౭ చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రక టించుడి. ౨౮ మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ౨౯ రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. ౩౦ మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి ౩౧ గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
క్రీస్తును ఒప్పుకోవడం
౩౨ మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. ౩౩ మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.
శాంతి కాదు కత్తి
౩౪ నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ౩౫ ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ౩౬ ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. ౩౭ తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; ౩౮ తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ౩౯ తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.
సేవ యొక్క ప్రతిఫలం
౪౦ మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ౪౧ ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. ౪౨ మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
అపొస్తలుల కార్యములు ౧౫
అన్యుల విశ్వాసులకు లేఖ
౨౨ అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును ౨౩ వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్య జనులుగానుండిన సహోదరులకు శుభము. ౨౪ కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు ౨౫ గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను ౨౬ మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. ౨౭ కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. ౨౮ విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విస ర్జింపవలెను. ౨౯ ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
ఆంటియోచ్‌లోని విశ్వాసులు సంతోషిస్తారు
౩౦ అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. ౩౧ వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. ౩౨ మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిర పరచిరి. ౩౩ వారు అక్కడ కొంతకాలము గడపి, సహో దరులయొద్దనుండి తమ్మును పంపిన ౩౪ వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. ౩౫ అయితే పౌలును బర్నబాయు అంతి యొకయలో నిలిచి, యింక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.
పౌలు రెండవ సువార్త ప్రయాణం
౩౬ కొన్ని దినములైన తరువాతఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆ యా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. ౩౭ అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను. ౩౮ అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. ౩౯ వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను; ౪౦ పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి, ౪౧ సంఘ ములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.
కీర్తనల గ్రంథము ౨౪
భూమి ప్రభువు
౧ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే. ౨ ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను. ౩ యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? ౪ వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. ౫ వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును. ౬ ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.) ౭ గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. ౮ మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. ౯ గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. ౧౦ మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే.ఆయనే యీ మహిమగల రాజు.
నిర్గమకాండము ౧
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో రెట్టింపు అవుతారు.
౧ ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను. ౨ దాను నఫ్తాలి గాదు ఆషేరు. ౩ వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. ౪ యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది. ౫ అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ౬ యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి. ౭ ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండియుండెను.
కొత్త ఫారోచే అణచివేత
౮ అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏల నారంభించెను. ౯ అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. ౧౦ వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను. ౧౧ కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి. ౧౨ అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి. ౧౩ ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి; ౧౪ వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.
మగ పిల్లలను చంపాలని ఫారో ఆజ్ఞ
౧౫ మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి ౧౬ మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయుచు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైనయెడల వాని చంపుడి, ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడని వారితో చెప్పెను. ౧౭ అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా ౧౮ ఐగుప్తురాజు ఆ మంత్ర సానులను పిలిపించిమీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను. ౧౯ అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. ౨౦ దేవుడు ఆ మంత్ర సానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ౨౧ ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ౨౨ అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.
నిర్గమకాండము ౨
మోషే జననం
౧ లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను. ౨ ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై యుండుట చూచి మూడునెలలు వానిని దాచెను. ౩ తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టి యేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా, ౪ వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను.
ఫరో కుమార్తె మోషేను రక్షిస్తుంది
౫ ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి ౬ తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. ౭ అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. ౮ అందుకు ఫరో కుమార్తెవెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ౯ ఫరో కుమార్తె ఆమెతోఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను. ౧౦ ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమెనీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.
మోషే ఐగుప్తుయన్‌ను చంపాడు
౧౧ ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. ౧౨ అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను. ౧౩ మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి. ౧౪ అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీ వేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు-మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే-నిశ్యముగా ఈ సంగతి బయలు పాడెననుకొని భయపడెను.
మోషే మిద్యానుకు పారిపోయాడు
౧౫ ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి యొక బావియొద్ద కూర్చుండెను. ౧౬ మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా ౧౭ మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. ౧౮ వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. ౧౯ అందుకు వారుఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా ౨౦ అతడు తన కుమార్తెలతొ అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. ౨౧ మోషేఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను. ౨౨ ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషేనేను అన్య దేశములో పరదేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను.
దేవుడు ఇశ్రాయేలీయుల మొర వింటాడు
౨౩ ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయు చున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. ౨౪ కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. ౨౫ దేవుడు ఇశ్రాయేలీ యులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.
నిర్గమకాండము ౩
మండుతున్న పొద వద్ద మోషే
౧ మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ౨ ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు. ౩ అప్పుడు మోషేఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్ప వింత చూచెదననుకొనెను. ౪ దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ౫ అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ౬ మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖ మును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను. ౭ మరియు యెహోవా యిట్లనెనునేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. ౮ కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను. ౯ ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని. ౧౦ కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. ౧౧ అందుకు మోషేనేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయు లను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడ నని దేవునితో అనగా ౧౨ ఆయననిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. ౧౩ మోషే చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచిమీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారుఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని నడిగెను. ౧౪ అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయనఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. ౧౫ మరియు దేవుడు మోషేతో నిట్లనెనుమీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. ౧౬ నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసిమీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని, ౧౭ ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. ౧౮ వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణ మంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ౧౯ ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును; ౨౦ కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయ దలచియున్న నా అద్భు తములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును. ౨౧ జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు. ౨౨ ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.