0 నిమిషాల పఠనం

లూకా సువార్త ౨౩

౩౨ మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు. ౩౩ వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి. ౩౪ యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి. ౩౫ ప్రజలు నిలువబడి చూచు చుండిరి; అధికారులునువీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతానురక్షించుకొనునని అపహసించిరి. ౩౬ అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి ౩౭ నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి.

హెబ్రీయులకు ౧౦

క్రీస్తు యొక్క పరిపూర్ణ త్యాగం
ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.
ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పిం చుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు. అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ౧౦ యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. ౧౧ మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పిం చుచు ఉండును. ౧౨ ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ౧౩ అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను. ౧౪ ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. ౧౫ ఈ విషయమై పరిశుద్ధాత్మకూడ మనకు సాక్ష్యమిచ్చు చున్నాడు. ౧౬ ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయు దును అని చెప్పిన తరువాత ౧౭ వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ౧౮ వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.

సామెతలు ౨౬

౧౭ తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు. ౧౮ తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు ౧౯ తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు. ౨౦ కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. ౨౧ వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. ౨౨ కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును. ౨౩ చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము. ౨౪ పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. ౨౫ వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మ కుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు. ౨౬ వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. ౨౭ గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును. ౨౮ అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషిం చును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.

యెషయా గ్రంథము ౪౪

యెహోవా ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు
అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము
నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము. నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను. నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడునేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను. మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను. విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ౧౦ ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు? ౧౧ ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. ౧౨ కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును ౧౩ వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రిక లతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును. ౧౪ ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును ౧౫ ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును. ౧౬ అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ ముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు ౧౭ దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును. ౧౮ వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను. ౧౯ ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు. ౨౦ వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవు చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు.
యెరూషలేము  పునరుద్ధరించబడాలి
౨౧ యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.
౨౨ మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము. ౨౩ యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును ౨౪ గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను ౨౫ నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. ౨౬ నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే. ౨౭ నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను ౨౮ కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను.

యెషయా గ్రంథము ౪౫

దేవుడు కోరెషునుని పిలుస్తాడు
అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.
నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను. ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను. మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? ౧౦ నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ౧౧ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? ౧౨ భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. ౧౩ నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళముచేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును ౧౪ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి నీవారగుదురు వారు నీవెంట వచ్చెదరు సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ యెదుట సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ౧౫ ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు. ౧౬ విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు. ౧౭ యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొంద కయు నుందురు. ౧౮ ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు. ౧౯ అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట లాడలేదు మాయాస్వరూపుడనైనట్టు3 నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే. ౨౦ కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు. ౨౧ మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు ౨౨ భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. ౨౩ నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు. ౨౪ యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు ౨౫ యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.