Matthew 8
1 ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. 2 ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. 3 అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి యాయెను. 4 అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను 5 ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి 6 ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను. 7 యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా 8 ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చు టకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెల విమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 9 నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను. 10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 11 అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహా ముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని 12 రాజ్య సంబంధులు1 వెలుపటి చీకటిలోనికి త్రోయబడు దురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను. 13 అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను. Acts 11
1 అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి. 2 పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు 3 నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. 4 అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను 5 నేను యొప్పే పట్టణములో ప్రార్థనచేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన 6 దానివైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాద జంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను. 7 అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని. 8 అందుకు నేనువద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా 9 రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండిదేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. 10 ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొని పోబడెను. 11 వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచి యుండిరి. 12 అప్పుడు ఆత్మనీవు భేదమేమియు చేయక వారితో కూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి; మేము కొర్నేలి యింట ప్రవేశించితివిు. 13 అప్పుడతడునీవు యొప్పేకు మనుష్యు లను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలి పించుము; 14 నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. 15 నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను. 16 అప్పుడుయోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తి స్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని. 17 కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను. 18 వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి. Psalms 18
25 దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు 26 సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు.మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు 27 శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. 28 నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును 29 నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును. 30 దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. 31 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? 32 నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. 33 ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు. 34 నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును. 35 నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెనునీ సాత్వికము నన్ను గొప్పచేసెను. 36 నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు. 37 నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయువరకు నేను తిరుగను. 38 వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ ద్రొక్కుదును 39 యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి 40 నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని 41 వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి కుత్తరమియ్యకుండును. 42 అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితినివీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని. 43 ప్రజలు చేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివినన్ను అన్యజనులకు అధికారిగా చేసితివినేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు 44 నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు 45 అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. 46 యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడునా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. 47 ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే. 48 ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును.నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువుబలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండినీవు నన్ను విడిపించుదువు 49 అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను. 50 నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు Genesis 41
1 రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా 2 చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. 3 వాటి తరువాత చూపునకు వికారమై చిక్కి పోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవులదగ్గర నిలుచుండెను. 4 అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. 5 అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. 6 మరియు తూర్పు గాలిచేత చెడి పోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. 7 అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. 8 తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకున గాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేక పోయెను. 9 అప్పుడు పానదాయకుల అధిపతినేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను. 10 ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతియింట కావలిలో ఉంచెను. 11 ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి. 12 అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. 13 అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా 14 ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను. 15 ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు 16 యోసేపునావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. 17 అందుకు ఫరోనా కలలో నేను ఏటియొడ్డున నిలుచుంటిని. 18 బలిసినవియు, చూపున కంద మైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను. 19 మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కి పోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు. 20 చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను. 21 అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపు నకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని. 22 మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను. 23 మరియు తూర్పు గాలిచేత చెడిపోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను. 24 ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను. 25 అందుకు యోసేపుఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు 26 ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్స రములు. 27 కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సర ములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సర ములు. 28 నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను. 29 ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి. 30 మరియు కరవు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశ మును పాడుచేయును. 31 దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును. 32 ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడి యున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింప బడెను. 33 కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియ మింపవలెను. 34 ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను. 35 రాబోవు ఈ మంచి సంవత్సర ములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. 36 కరవుచేత ఈ దేశము నశించి పోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. 37 ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక 38 అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను. 39 మరియు ఫరోదేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. 40 నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. 41 మరియు ఫరోచూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను. 42 మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి 43 తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను. 44 మరియు ఫరో యోసేపుతోఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. 45 మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను. 46 యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను. 47 సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. 48 ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను. 49 యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్య మాయెను గనుక కొలుచుట మానివేసెను. 50 కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. 51 అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. 52 తరువాత అతడునాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. 53 ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సర ములు గడచిన తరువాత 54 యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహార ముండెను. 55 ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో-మీరుయోసేపు నొ ద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. 56 కరవు ఆ దేశమం దంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశ మందు ఆ కరవు భారముగా ఉండెను; 57 మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.