౪౩ వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రులయొద్దనుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి. ౪౪ ఆయనను అప్పగించువాడునేనెవరిని ముద్దుపెట్టు కొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. ౪౫ వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయిబోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా ౪౬ వారు ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి. ౪౭ దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. ౪౮ అందుకు యేసుమీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? ౪౯ నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను). ౫౦ అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి. ౫౧ తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి. ౫౨ అతడు నారబట్ట విడిచి, దిగం బరుడై పారిపోయెను.
గలతీయులకు ౨
నిర్దోషిగా అయ్యేది విశ్వాసం మూలంగానే
౧ అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూష లేమునకు తిరిగి వెళ్లితిని. ౨ దేవదర్శన ప్రకా రమే వెళ్లితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవు నేమో, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని. ౩ అయినను నాతోకూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్ట బడలేదు. ౪ మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తు యేసువలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన జరిగినది. ౫ సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్కగడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. ౬ ఎన్నికైన వారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరునివేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు. ౭ అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్ప గింపబడెనని వారు చూచినప్పుడు, ౮ అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు, ౯ స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొ స్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి. ౧౦ మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని.
పాల్ సెఫాస్‌ను ఎదుర్కొంటాడు
౧౧ అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని; ౧౨ ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను. ౧౩ తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోస పోయెను. ౧౪ వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగానీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించు చుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింప వలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు? ౧౫ మనము జన్మమువలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వా సమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూల మున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్రసంబంధ మైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము; ౧౬ ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. ౧౭ కాగా మనము క్రీస్తునందు నీతి మంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపుల ముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు. ౧౮ నేను పడ గొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా. ౧౯ నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని. ౨౦ నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. ౨౧ నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే.
కీర్తనల గ్రంథము ౧౧౧
మహిమాన్వితమైనవి, మహిమాన్వితమైనవి ఆయన రచనలు.
౧ యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. ౨ యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగలవారందరు వాటిని విచారించు దురు. ౩ ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ౪ ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు ౫ తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చి యున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును. ౬ ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి యున్నాడు తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడిచేసి యున్నాడు. ౭ ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి. ౮ అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి. ౯ ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించు వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. ౧౦ యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.
సమూయేలు రెండవ గ్రంథము ౧౧
దావీదుమరియు బత్షెబ
౧ వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతనివారిని ఇశ్రా యేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహ రించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి; అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ౨ ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను. ౩ ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చిఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా ౪ దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను. ౫ ఆ స్త్రీ గర్భవతియైనేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా ౬ దావీదు హిత్తీయుడగు ఊరియాను నాయొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ౭ ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమ మును జనుల యోగక్షేమమును యుద్ధసమాచారమును అడి గెను. ౮ తరువాత దావీదుఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను. ౯ అతనివెనుక రాజు ఫలా హారము అతనియొద్దకు పంపించెను గాని ఊరియా తన యింటికి వెళ్లక తన యేలినవాని సేవకులతో కూడ రాజ నగరిద్వారమున పండుకొనెను. ౧౦ ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరి యాను పిలిపించినీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా; యింటికి వెళ్లకపోతివేమని యడుగగా ౧౧ ఊరియామందస మును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవా బును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను, భోజనపానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. ౧౨ దావీదునేడును నీ విక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలి చెను. ౧౩ అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను; అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను; సాయంత్రమున అతడు బయలు వెళ్లి తన యింటికి పోక తన యేలినవాని సేవకుల మధ్య పడకమీద పండుకొనెను.
ఊరియాకు వ్యతిరేకంగా దావీదు చేసిన పాపం
౧౪ ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొమ్మని ౧౫ యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను. ౧౬ యోవాబు పట్ట ణమును ముట్టడివేయు చుండగా, ధైర్యవంతులుండు స్థల మును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ౧౭ ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను. ౧౮ కాబట్టి యోవాబు యుద్ధ సమాచార మంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను ౧౯ యుద్ధసమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొనియుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? ౨౦ గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలి యక పోయెనా? ౨౧ ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునకఎత్తి గోడమీదనుండి అతని మీద వేసినందున అతడు తేబేసుదగ్గర హతమాయెను గదా? ప్రాకారముదగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవుతమరి సేవకు డగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను. ౨౨ దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను. ౨౩ ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మమువరకు వెంటాడి గెలిచితివిు. ౨౪ అప్పుడు ప్రాకారముమీదనుండి విలుకాండ్రు తమ సేవకులమీద అంబులువేయగా రాజు సేవ కులలో కొందరు హతమైరి, తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియాకూడ హతమాయెను. ౨౫ అందుకు దావీదునీవు యోవాబుతో ఈ మాట చెప్పుముఆ సంగతినిబట్టి నీవు చింతపడకుము; ఖడ్గము ఒకప్పుడు ఒకనిమీదను ఒకప్పుడు మరియొకనిమీదను పడుట కద్దు; పట్టణముమీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి, నీవు యోవాబును ధైర్యపరచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను.
దావీదు బత్షెబాను వివాహం చేసుకున్నాడు
౨౬ ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హత మైన సంగతి విని తన భర్తకొరకు అంగలార్చెను. ౨౭ అంగ లార్పుకాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య యయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.
సమూయేలు రెండవ గ్రంథము ౧౨
నాతాను దావీదును మందలించడం
౧ కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెనుఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి. ౨ ఒకడు ఐశ్వర్య వంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱలును గొడ్లును కలిగియుండెను. ౩ అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱ పిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచు కొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను. ౪ అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను. ౫ దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించు కొనియెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. ౬ వాడు కని కరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱ పిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను. ౭ నాతాను దావీదును చూచిఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమ నగాఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకను గ్రహించి ౮ నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. ౯ నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా? ౧౦ నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును. ౧౧ నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపా యము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను. ౧౨ పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.
దావీదు యొక్క నష్టం మరియు పశ్చాత్తాపం
౧౩ నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతానునీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ౧౪ అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి ౧౫ గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను. ౧౬ యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. ౧౭ దావీదు ఉప వాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి యుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను. ౧౮ ఏడవ దినమున బిడ్డ చావగాబిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటిలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను. ౧౯ ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చని పోయెనను సంగతి గ్రహించిబిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారుచని పోయెననిరి. ౨౦ అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానముచేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను. ౨౧ అతని సేవకులుబిడ్డ జీవముతో ఉండగా ఉప వాసముండి దానికొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణ మైనప్పుడు లేచి భోజనము చేసితివి. నీవీలాగున చేయుట ఏమని దావీదు నడుగగా ౨౨ అతడుబిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని. ౨౩ ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉప వాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదును గాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.
సొలొమోను జననం
౨౪ తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమెయొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. ౨౫ యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా1 అని అతనికి పేరు పెట్టెను.
దావీదు రబ్బాను బంధించాడు
౨౬ యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణముమీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. ౨౭ దావీదునొద్దకు అతడు దూతలను పంపినేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని; ౨౮ నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానము చేయగా ౨౯ దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధముచేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తలమీదనుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మనుగులంత యెత్తుండెను. ౩౦ మరియు అతడు పట్టణములోనుండి బహు విస్తారమైన దోపుసొమ్ము పట్టుకొని పోయెను. ౩౧ పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదును గల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.
Help us improve Quiet Time
Allow usage analytics so we can understand which features are useful. You can change this anytime on our Privacy page.