లేవీయకాండము ౨౭
విలువల గురించి నియమాలు
౧ మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను ౨ నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను. ౩ నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను. ౪ ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను. ౫ అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను. ౬ ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. ౭ అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణ యింపవలెను. ౮ ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన యెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. ౯ యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. ౧౦ అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదాని నైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. ౧౧ జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను. ౧౨ అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. ౧౩ అయితే ఒకడు అట్టిదానిని విడిపింప గోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను. ౧౪ ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డ దైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. ౧౫ తన యిల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును. ౧౬ ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహో వాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది. ౧౭ అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతి ష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము. ౧౮ సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠిం చినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను. ౧౯ పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును. ౨౦ అతడు ఆ పొలమును విడిపింపనియెడ లను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు. ౨౧ ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును. ౨౨ ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల ౨౩ యాజ కుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను. ౨౪ సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను. ౨౫ నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు. ౨౬ అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱమేకల మందలోనిదైననేమి యెహోవాదగును. ౨౭ అది అపవిత్రజంతువైనయెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను. ౨౮ అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్య మైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించినయెడల ప్రతి ష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతి ష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. ౨౯ మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేని నైనను విడిపింపక హతము చేయవలెను. దశమభాగాలపై సూచన
౩౦ భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫల ములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ౩౧ ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడి పింప గోరినయెడల దానిలో అయిదవ వంతును దానితో కలుపవలెను. ౩౨ గోవులలోనేగాని గొఱ్ఱ మేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును. ౩౩ అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చ కూడదు. దాని మార్చినయెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము. ౩౪ ఇవి యెహోవా సీనాయికొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. యెహెజ్కేలు ౧౭
రెండు ఈగల్స్ మరియు ఒక ద్రాక్షతీగ యొక్క ఉపమానం
౧ మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను ౨ నరపుత్రుడా, నీవు ఉప మానరీతిగా విప్పుడు కథ యొకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా ప్రభువగు యెహోవా సెల విచ్చునదేమనగా ౩ నానావిధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను. ౪ అది దాని లేతకొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక పురమందు దానిని నాటెను. ౫ మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను. ౬ అది చిగిర్చిపైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను; దాని కొమ్మలు ఆ పక్షిరాజువైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను; ఆలాగున ఆ ద్రాక్షచెట్టు శాఖోపశాఖలుగా వర్థిల్లి రెమ్మలువేసెను. ౭ పెద్ద రెక్కలును విస్తారమైన యీకెలునుగల యింకొక గొప్ప పక్షి రాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి, బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి యగునట్లుగా అది విస్తార జలముగల మంచి భూమిలో నాటబడియుండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదులకాలువ లోనుండి అది యా పక్షితట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. ౮ కావున నీవీలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా? ౯ అది యెండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు, దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు. ౧౦ అది నాటబడినను వృద్ధి పొందునా? తూర్పుగాలి దానిమీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదిలోనే యెండి పోవును. ఉపమానం వివరించబడింది
౧౧ మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను ౧౨ తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుముఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండు టకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను. ౧౩ మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును, ౧౪ అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమ వంతులను తీసికొనిపోయెను. ౧౫ అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు ౧౬ ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవ ముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు. ౧౭ యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు. ౧౮ తన ప్రమా ణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు. ౧౯ ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తలమీదనే మోపు దును, ౨౦ అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును. ౨౧ మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలిసికొనునట్లు అతని దండువారిలో తప్పించుకొని పారి పోయినవారందరును ఖడ్గముచేత కూలుదురు, శేషించిన వారు నలుదిక్కుల చెదరిపోవుదురు. ౨౨ మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఎత్తయిన దేవదారువృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నతపర్వతముమీద దాని నాటు దును. ౨౩ ఇశ్రాయేలు దేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును. ౨౪ దాని కొమ్మల నీడను అవి దాగును; మరియు యెహో వానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘన మైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవు నట్లును ఎండిన చెట్టు విక సించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను. సామెతలు ౧౬
౧ హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును. ౨ ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును. ౩ నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ౪ యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ౫ గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ౬ కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు. ౭ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ౮ అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము. ౯ ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును ౧౦ దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. ౧౧ న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను. ౧౨ రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును. ౧౩ నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు. ౧౪ రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును. ౧౫ రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు. ౧౬ అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ౧౭ చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ౧౮ నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును ౧౯ గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు. ౨౦ ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ౨౧ జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును. ౨౨ తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష ౨౩ జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ౨౪ ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి. ౨౫ ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును. ౨౬ కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును. ౨౭ పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది. ౨౮ మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును. ౨౯ బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును. ౩౦ కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. ౩౧ నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును. ౩౨ పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు ౩౩ చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము. 1 కొరింథీయులకు ౩
దేవుని తోటి కార్మికులు
౧ సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను. ౨ అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై ¸ ౩ మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? ౪ ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పు నప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా? ౫ అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి ౬ నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే ౭ కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. ౮ నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. ౯ మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు. వెల్లడి అయిన అంశాలు ఆత్మ సంబంధంగా మాత్రమే అర్థం అవుతాయి
౧౦ దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచు కొనవలెను. ౧౧ వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. ౧౨ ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, ౧౩ వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ౧౪ పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును. ౧౫ ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును. దేవుని ఆలయం మరియు దేవుని జ్ఞానం
౧౬ మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ౧౭ ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు. ౧౮ ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. ౧౯ ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; ౨౦ మరియుజ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలి యును అని వ్రాయబడియున్నది. ౨౧ కాబట్టి యెవడును మను ష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. ౨౨ పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. ౨౩ మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.